అరిబండి ప్రసాద్‌

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలో రైతులు ముందు భాగాన ఉండడంతో వారి సమస్యలు ప్రముఖంగా ముందుకు వచ్చాయి. ఈ చట్టాల వల్ల దేశ ప్రజలు ఎదుర్కొనబోయే అన్ని సమస్యలు ముందుకు రాలేదు. ముఖ్యంగా, కార్పొరేట్‌ శక్తుల గుప్పిట్లోకి వెళ్ళనున్న వ్యవసాయాభివృద్ధి, ఆహారోత్పత్తి, దేశ ప్రజల ఆహార పోషక భద్రత అంశాలు ముందుకు రాలేదు. కానీ రైతుల డిమాండ్లలో ఇవి అంతర్లీనంగా ఉన్నాయి. అందువల్ల, ఈ ప్రభావాలను కూడా దృష్టిలో పెట్టుకుంటే ప్రభుత్వం అందించిన సవరణలు సరిపోవనీ, ఈ కొత్త చట్టాలను ఉపసంహరించా ల్సిందేననీ తేలింది.

రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలోని మార్కెట్‌ యార్డులకు బయట రైతులు ఎక్కడైనా, ఎవరికైనా తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు, వీటిని ఎవరైనా కొనుక్కోవచ్చు అనే చట్టం ముఖ్యమైనది. ఈ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలోని మార్కెట్‌ యార్డులకు బయట ప్రయివేటు మార్కెట్‌ యార్డులను ఏర్పర్చుకోవచ్చు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆజమాయిషీ ఉండదు. అందువల్ల వీటిని బైపాస్‌ మార్కెట్లుగా పరిగణించవచ్చు. ఈ బైపాస్‌ మార్కెట్‌లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియమాలు కాక ఆయా యాజమాన్యలే సొంత నియమాలు రూపొందించుకుంటాయి. ఈ చట్టానికి తోడు ”నిత్యావసర వస్తువుల సడలింపు చట్టం” బైపాస్‌ మార్కెట్లకు, కార్పొరేట్‌ శక్తులకు ఎక్కడలేని విచక్షణా అధికారాలను అందిస్తుంది. ఇవి ఒక విధంగా అంతరించిన పెట్టుబడిదారి ”లైజఫైర్‌” సిద్ధంతానికి అనుగుణంగా ఏ నియంత్రణ లేకుండా పూర్తిగా స్వేచ్ఛతో పనిచేస్తాయి. ఫలితంగా, ఒకవైపు రైతు ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లభిస్తుందని హామీ లేకపోగా వినిమయ దారుల నుండి పెరిగే ధరల రూపంలో కార్పొరేట్లకు ఎనలేని లాభాలను అందిస్తాయి. ఆపత్కాల సమయంలో కార్పొరేట్‌ గుప్పిట్లోని ఆహార మార్కెట్‌లు ఎలా పని చేస్తాయో తెలుసుకోవాలంటే తాజా అమెరికా అనుభవం మన కండ్లముందు ఉంది. కారోనా కల్లోల కాలంలో ఉచిత ఆహార పంపిణీ కోసం కార్లల్లో వచ్చి మైళ్ళ కొద్దీ ఆ దేశ ప్రజలు క్యూలో ఉండాల్సి వస్తుందంటే ఆ దేశ ప్రజల దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ ధోరణికి విరుద్ధంగా మన దేశ ప్రభుత్వం ప్రజలకు ఉచిత ఆహారాన్ని కొన్ని నెలల పాటైనా ఈ కాలంలో అందించిందంటే, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆహార నిల్వలు ఉండడంతోనే ఇది సాధ్యమైంది. ఇదే నిల్వలు కార్పొరేట్‌ అధీనంలో ఉంటే పేద ప్రజలకు ఆహార లభ్యత ఎంత దుర్భరంగా ఉండగలదో అమెరికా అనుభవాన్ని చూసి అంచనా వేసుకోవాల్సిందే.

కనీస మద్దతు ధరల ప్రాధాన్యత
వ్యవసాయోత్పత్తుల ఉత్పత్తి ఖర్చు స్థానిక పరిస్థితుల మీద ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. పెట్టుబడిదారీ వ్యవసాయోత్పత్తిలో అన్ని ఉత్పత్తి ఖర్చులు పోను రైతు బతికి తన జీవనం కొనసాగించటానికి, తిరిగి ఉత్పత్తి కొనసాగింపుకు, మౌలిక సౌకర్యాల పటిష్టతకు కొంత మిగులు కూడా అవసరం. అందువల్ల పెట్టుబడి విధానంలో వ్యవసాయోత్పత్తి కొనసాగించటానికి కనీస ఆదాయం అవసరం. ఈ ధోరణికి విరుద్దంగా వ్యవసాయోత్పత్తుల ధరలు అంతర్జాతీయ మార్కెట్‌కు జోడించి తీవ్ర హెచ్చు తగ్గులకు గురవుతాయి. ఈ హెచ్చు తగ్గుల దుష్ఫ్రభావాల నుండి రైతు సాగుకు రక్షణ అవసరం. ఈ రక్షణ కనీస మద్దతు ధరల రూపంలో ఉండాలని రైతులు కోరుకుంటున్నారు. ఈ ధర హక్కుగా లభించాలని కోరు కుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ హక్కు కూడా లేకుండా రైతు జీవిస్తూ వ్యవసాయోత్పత్తిని కొనసాగించలేడు. దేశ పురోగతి, వ్యవసాయాభివృద్ధి, దేశ ప్రజల ఆహార పోషక భద్రతలన్నీ రైతు సాగు మనుగడపై ఆధారపడి ఉన్నాయి. ఇవి దేశ ప్రజాస్వామ్య విలువలు, సాంఘిక సంబంధాలను కూడా నియంత్రిస్తాయి. అందువల్లనే కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితులను అధిగమించటానికి చట్టబద్దమైన కనీస మద్దతు ధరల వ్యవస్థను, ఆ ధరకు కొనే వ్యవస్థను రైతులు కోరుతున్నారు.

కనీస మద్దతు ధర అందుబాటు
రైతుల ఆందోళన తరువాత కనీస మద్దతు ధరల వ్యవస్థ కొనసాగుతుందని, దాన్ని ముట్టకోమని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడున్న కనీస మద్దతు ధరల అందుబాటులోని లోపాలను కేంద్ర ప్రభుత్వ ”వ్యవసాయోత్పత్తుల ఖర్చుల ధరల కమిషన్‌” గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి నివేదికలో ఎత్తి చూపుతున్నది. ఇవి రైతులందరికీ, అన్ని పంటలకు లభించాల్సిన అవసరాన్ని ఈ నివేదికలు నొక్కి చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో, కేవలం మద్దతు ధరల వ్యవస్థను ఇప్పుడున్నట్టుగా కొనసాగిస్తామనే ప్రభుత్వ హామీ రైతులకు ఇప్పటికన్నా ఏమైనా అదనపు ప్రయోజనాలను అందించగల్గుతుందా? అందించలేదు. రైతులు కోరుతున్నట్టుగా నిర్ణయించిన ధరలు అన్ని పంటలకు, రైతులందరికీ అందేలా చట్టబద్ద ఏర్పాటు అవసరం. ప్రస్తుత చట్ట పరిధిలో దీనిని ఇముడ్చడం సాధ్యం కాదు. చట్టాలే సరిగ్గా పని చేయనప్పుడు (ఉదాహరణకు జాతీయ ఆహార పోషక భద్రత చట్టం, ఉపాధి హామీ చట్టం, నిర్వాసితుల పునరావాస చట్టం తదితరాలు) రాతపూర్వక హామీలు పని చేస్తాయని రైతులు విశ్వసించడం లేదు.

రైతు ఆందోళనపై ఇతర శక్తుల ప్రభావాలు?
1990 నుంచి బహిరంగంగా అమలు చేస్తున్న సంస్కరణ విధానాలు రైతుల్ని సంక్షోభంలో పడేశాయి. వీరు నిజ ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్నారు. వ్యవసాయ ప్రంపంచీకరణకు దాని కార్పొరేటీకరణ అవసరమని పాలకులు భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా దాదాపు 2000 ప్రాంతంలోనే ఆర్థిక పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా వ్యవసాయ సంస్కరణల అమలుకు కార్యాచరణను రూపొందించారు. దీనిలో కాంట్రాక్టు సాగు ఒక ముఖ్యాంశం. గతంలో చెరుకు ఫ్యాక్టరీల ద్వారా అమలు చేసిన చెరుకు సాగు కాంట్రాక్టు ఇప్పటి కాంట్రాక్టు సాగుకు పూర్తిగా భిన్నమైనది. చెరుకు కాంట్రాక్టు సాగులో ప్రభుత్వ పాత్ర బలంగా ఉంది. అయినా, చెరుకు రైతులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనిలో రైతులు సరఫరా చేసిన చెరుకుకు ఫ్యాక్టరీల కోట్లాది రూపాయల బకాయిలు కొనసాగుతున్నాయి. దాదాపు ప్రతి సంవత్సరం ఈ బకాయిలు తీర్చాలని రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా పెట్టే కాంట్రాక్టు సాగు చట్టం పూర్తిగా భిన్నమైంది. వీటిలో కాంట్రాక్టు యాజమాన్యం పాత్రే కీలకం. ఈ చట్టంలో చిన్న రైతును, శక్తివంతమైన కాంట్రాక్టు యాజమాన్యాలను సమ ఉజ్జీలుగా భావించి చట్ట రూపకల్పన చేయడం ప్రధానలోపం. బలహీన రైతుకు కాంట్రాక్టు యాజమాన్యాల నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నది. పైగా కాంట్రాక్టు ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి ఆజమాయిషీ లేదు. ఈ యాజమాన్యాలు తమ ఉత్పత్తుల్ని ఎక్కడైనా, ఎవరికైనా దేశంలో లేక విదేశాల్లో అమ్ముకోవచ్చు.

తెలంగాణ రాష్ట్రం విత్తనోత్పత్తిలో ముందు పీఠికలో ఉంది. ఈ విత్తనోత్పత్తి ప్రధానంగా కాంట్రాక్టు రూపంలో కొనసాగుతోంది. దీనికి రాష్ట్ర చట్టం ఉన్నప్పటికీ ఇది సరిగ్గా అమలు కావడం లేదు. కొత్త కాంట్రాక్టు చట్టం ప్రకారం వీరు ఉత్పత్తి చేసిన విత్తనాలను రాష్ట్రంలోనే అమ్మాల్సిన నియమం లేదు. వీరు ఎక్కడైనా, ఎంతకైనా అమ్ముకోవచ్చు. మరి రాష్ట్ర రైతుల విత్తన అవసరాలను ఎవరు తీర్చాలి? అనివార్యంగా దిగుమతుల మీద ఆధారపడాలా? కొత్త చట్టాల వల్ల విత్తనం ద్వారా స్వదేశీ, విదేశీ కార్పొరేట్‌ సంస్థలు పూర్తి ఆధిపత్యం సంపాదించుకుంటాయి. పైగా కార్పొరేట్‌ యాజమాన్యలపై ప్రజల విశ్వాసం, ప్రత్యేకంగా రైతుల విశ్వాసం వేగంగా బలహీన పడుతుంది. పై నేపథ్యంలో, అత్యంత కీలకమైన రైతుల భవిష్యత్తు, దేశ ప్రజల ఆహార పోషకాల భద్రత, దేశాభివృద్ధి భవిష్యత్‌ కార్పొరేట్‌ యాజమాన్యల గుప్పిట్లో ఎలా పెట్టగలం? కానీ కొత్త వ్యవసాయ చట్టాలు చేసేది ఇదే. ఇవి ఇటు రైతుల్లో, అటు దేశ ప్రజల్లో ఆభద్రతా భావాన్ని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వ్యవసాయ చట్టాలకు ప్రభుత్వం సూచించిన సవరణలు సరిపోవని, ఈ చట్టాలను పూర్తిగా ఉపసంహరించాలని కోరుతున్న రైతుల డిమాండ్‌ న్యాయమైనది.

Courtesy Nava Telangana

Add a comment...