లైంగిక హింస 30 నుంచి 48 శాతానికి పెరుగుదల
పాపులేషన్‌ కౌన్సిల్‌ సర్వే వెల్లడి

న్యూఢిల్లీ: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై చోటుచేసుకుంటున్న హింస భారీగా పెరిగిందని తాజాగా ఓ సర్వే వెల్లడించింది. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన యూపీలో బాలికలు, మహిళలపై హింస 2015-16 కాలంలో 23.5 శాతంగా ఉండగా, అది 2018-19లో 51 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో లైంగిక హింస సైతం 30 శాతం నుంచి 48 శాతానికి చేరిందని స్వచ్ఛంద సంస్థ అయిన పాపులేషన్‌ కౌన్సిల్‌ అధ్యయనం పేర్కొంది. మహిళలపై హింసానిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ డేటాను విడుదల చేసింది. ఉదయ అనే పేరుతో విడుదల చేసిన ఈ అధ్యయనం.. యూపీలో 2015-16 కాలంలో దాదాపు 10 వేల మందికిపైగా కౌమరులు ఈ సర్వేలో పాల్గొన్నారనీ, 2018-19లోనూ తిరిగి వారే ఈ సర్వేలో పాలుపంచుకున్నారని తెలిపింది.

ఈ రెండు సర్వే రిపోర్టులను గమనిస్తే.. శారీరక, లైంగిక, మానసిక హింసను గురవుతున్న వివాహిత మహిళల సంఖ్య రెట్టింపు అయింది. ”2015-16లో వివాహితలపై (15-19 సంవత్సరాలు) శారీరక హింస 23.5 శాతంగా నమోదైంది. ఇది 2018-19లో రెట్టింపై 51 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో మానసిక హింస 19 శాతం నుంచి 35 శాతానికి పెరిగింది. ఈ రెండు సర్వేలను గమనిస్తే.. యుక్తవయస్సు బాలికలపై నేరాలు పెరుగుతున్న ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాల వేధింపులు సైతం 3 శాతం నుంచి 4.8 శాతానికి పెరిగాయి. యూపీతో పాటు బీహార్‌లోనూ పాపులేషన్‌ కౌన్సిల్‌ సర్వే జరిపింది. దేశ కౌమరదశ జనాభాలో కేవలం ఈ రెండు రాష్ట్రాల్లోనే 25 శాతం మంది ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో చిన్న వయస్సులోనే వివాహాలు, లైంగిక హింస, ప్రసవ ఆరోగ్య ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయనీ, ఇది ఆందోళన కలిగించే విషయమని హెచ్చరించింది.

Courtesy Nava Telangana

Add a comment...