చెరువులో మృతదేహాలు లభ్యం

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. కూరగాయల కోసం పొలానికి వెళ్ళిన ఇద్దరు అక్కచెల్లెళ్లు అసోధర్‌ ప్రాంతంలోని ఓ గ్రామ చెరువులో విగత జీవులుగా తేలారు. మైనర్లయిన దళిత సోదరీమణులను (12, 8) గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చి చెరువులో పడేసినట్టుగా భావిస్తున్నారు. కాగా వారి శరీరాలపై తీవ్రగాయాలున్నట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కూరగాయలు తీసుకువచ్చేందుకు వెళ్ళిన ఇద్దరూ ఎంతకీ తిరిగిరాకపోవటంతో తల్లిదండ్రులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బాలికల మృతదేహాలు చెరువులో బయటపడటంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు ఏఎస్‌పీ రాజేష్‌ కుమార్‌ తెలిపారు.

రెండు మతదేహాలపైనా తీవ్ర గాయాలున్నాయని ఆయన తెలిపారు. బాలికలపై లైంగికదాడి యత్నం జరిగివుంటుందనీ అనుమానిస్తున్నట్టు చెప్పారు. వారు ప్రతిఘటించటంతో బాలికలను హత్యచేసి ఉంటారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. బాలికలను హతమార్చిన వారిని గుర్తించి కఠిన శిక్ష పడేలా చూడాలని వారు వేడుకుంటున్నారు. అయితే మతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపించామని, నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని పోలీసులు తెలిపారు.

Courtesy Nava Telangana

Add a comment...