కరోనాతో జీవితాలు తారుమారు

న్యూఢిల్లీ: వారంతా చాంపియన్‌ రెజ్లర్లు.. కుస్తీ పోటీల ద్వారా భారీగా సంపాదించేవారు. కానీ కరోనా వైరస్‌ వారి జీవన సరళిని దారుణంగా దెబ్బతీసింది. ఫలితంగా రోజు కూలీలుగా మారి దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. 26 ఏళ్ల సంగ్రామ్‌.. హరియాణాలోని ఝజ్జర్‌లో పేరుమోసిన రెజ్లర్‌. అతడి పట్టుకు ఎంతటి ప్రత్యర్థులైనా చిత్తు కావాల్సిందే. కుస్తీ పోటీల ద్వారా సంగ్రామ్‌ పెద్ద మొత్తంలో సంపాదించేవాడు. కానీ కొవిడ్‌ కారణంగా రెజ్లింగ్‌ పోటీలు జరగడంలేదు. దాచుకున్న డబ్బులు ఖర్చయ్యాయి. దాంతో భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని పోషించుకొనేందుకు సంగ్రామ్‌ కూలీగా మారాడు. ‘కుస్తీ పోటీల ద్వారా ఏడాదికి రూ. 2.5 లక్షల పైగానే వచ్చేవి. కానీ, ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్తాలు మోసినా నెలకు రూ. 5వేలు లభించడమే కష్టంగా ఉంది. ఐదుగురు సభ్యుల కుటుంబ పోషణకు ఈ మొత్తం సరిపోవడంలేదు’ అని సంగ్రామ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

మరికొందరిదీ అదే దుస్థితి..
గోలు పహిల్వాన్‌గా ప్రసిద్ధుడైన హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన దేశ్‌రాజ్‌.. స్వరాష్ట్రంతోపాటు పంజాబ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌, జమ్మూ, కశ్మీర్‌లో కుస్తీ వీరుడిగా మంచి పేరు గడించాడు. కంగ్రాకు చెందిన ఈ రెజ్లర్‌ కూడా మండీలో రోజు కూలీగా దుర్భర జీవనం గడుపుతున్నాడు. ‘నెలంతా కష్టపడ్డా రూ. 7 నుంచి 8వేలకు మించి రావడంలేదు. ఒలింపిక్‌ రెజ్లర్ల తరహాలో మాకు కూడా ప్రభుత్వం సాయం అందించాలి’ అని 29 ఏళ్ల దేశ్‌రాజ్‌ కోరాడు. కపుర్తలాకు చెందిన గురిందర్‌ సింగ్‌ కుటుంబాన్ని పోషించుకొనేందుకు స్థానికంగా కూరగాయలు, పండ్లు అమ్ముతున్నాడు. ‘కుస్తీ పోటీలనుంచి లభించే ఆదాయం తప్ప నాకు మరో మార్గంలేదు. ఈ పరిస్థితి ఎంతకాలమో తెలియడంలేదు. తినడానికి ఆహారం లేక దోసకాయ, బొప్పాయితో కడుపు నింపుకొన్న రోజులున్నాయి’ అని గురిందర్‌ సింగ్‌ చెప్పడం అతడి పరిస్థితికి అద్దం పడుతోంది. పట్నాకు చెందిన కౌశల్‌ నాథ్‌ రాష్ట్ర చాంపియన్‌గా వరుసగా ఎనిమిది సంవత్సరాలు సీనియర్‌ నేషనల్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షి్‌పలో బిహార్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కరోనా వైర్‌సతో పరిస్థితి తలకిందులై ప్రస్తుతం అతడు ఓ వ్యవసాయ క్షేత్రంలో కూలీగా పని చేయాల్సి వస్తోంది. ‘పూట గడవడం కష్టంగా మారడంతో నేను గెల్చుకున్న పతకాలన్నీ అమ్మేశా. ఇప్పుడు కూలీగా పనిచేస్తూ రోజుకు రూ. 300 సంపాదిస్తున్నా’ అని కౌశల్‌ వాపోయాడు.

రూ. 40 కోట్ల నష్టం
మార్చి నుంచి దేశవ్యాప్తంగా 750కిపైగా కుస్తీ పోటీలు ఆగిపోయాయి. దాంతో ఆ పోటీల్లో బరిలోకి దిగాల్సిన పేరు మోసిన రెజ్లర్లు రూ. 40 కోట్లు నష్టపోయినట్టు సమాచారం.

Courtesy Andhrajyothi

Add a comment...