ఎనిమిదేళ్ల క్రితం లారీని ఢీకొట్టి, నేల మీద చతికిలబడిన ఆ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌… ఇప్పుడు అంతర్జాతీయ క్రీడా వేదిక మీద విహంగమై ఎగురుతోంది! ప్రమాదంలో కాలు పోగొట్టుకుంటేనేం, కృత్రిమ కాలుతో పారాలింపిక్స్‌ వరల్డ్‌ ఛాంపియన్‌గా టైమ్స్‌ మ్యాగజైన్‌ కవర్‌ మీదకు ఎక్కేసింది! ఆమె ప్రతిరూపంలో బార్బీ బొమ్మను కూడా రూపొందించే స్థాయికి ఎదిగిన ఆ 31 ఏళ్ల ఉక్కు మహిళే… మానసా జోషి! వచ్చే ఏడాది టోక్యోలో జరగబోయే పారాలింపిక్స్‌ స్వర్ణ పతకం మీద గురిపెట్టిన జోషి కథ ఇది!

అది 2011, డిసెంబరు 11, శుక్రవారం. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ముంబయిలో నా మొదటి ఉద్యోగం. ఆఫీసు ఇంటికి ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో టు వీలర్‌ మీద వెళ్లడం అలవాటైంది. రోజులాగే ఆ రోజు కూడా బయల్దేరి, ఫ్లైఓవర్‌ కింద నుంచి యు టర్న్‌ తీసుకున్నాను. అంతే…. రాంగ్‌ రూట్‌లో వస్తున్న ఓ లారీ బైక్‌ను గుద్ది, నా ఎడమ కాలు మీద నుంచి వెళ్లిపోయింది. నేను అప్పటికీ స్పృహలోనే ఉన్నాను. హెల్మెట్‌ తీసి గమనిస్తే, నాకు తగిలిన దెబ్బలు పెద్దవేనని అర్థమైంది. ఎడమ కాలు పూర్తిగా ఛిద్రమైంది. రెండు చేతుల్లోని ఎముకలూ విరిగాయి. విపరీతంగా రక్తస్రావం అవుతోంది. నా చుట్టూ అటుగా వెళ్లేవాళ్లందరూ గుమిగూడారు. ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని తాపత్రయపడ్డారు. కానీ అలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో వాళ్లకు అర్థం కాలేదు. అలా అంబులెన్స్‌లో మొదట ఓ చిన్న క్లినిక్‌కు, ఆ తర్వాత పెద్ద ఆస్పత్రికి చేరేసరికి సాయంత్రం ఐదున్నర దాటింది. 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఆస్పత్రికి వెళ్లే దారిలో ఉన్న చిన్న చిన్న గుంటలు, గతుకుల్లో అంబులెన్స్‌ కుదుపులకు నొప్పితో ప్రాణాలు పోయినంత పనైంది. అలా ప్రమాదం జరిగిన తొమ్మిది గంటల తర్వాత నాకు అసలైన చికిత్స మొదలైంది. కాలు కాపాడడమే ధ్యేయంగా డాక్టర్లు వరుస సర్జరీలతో తీవ్రంగా శ్రమించినా, గాంగ్రీన్‌ కారణంగా చివరకు కాలు తొలగించక తప్పలేదు.

ఎనిమిదేళ్ల తర్వాత…
2019 ఆగస్టు, స్విట్జర్లాండ్‌లోని బాసిల్‌. ప్రమాదం జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత, భారతీయ పారా బాడ్మింటన్‌ జాతీయ క్రీడాకారిణిగా, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడ్డాను. నా ప్రత్యర్ధి మరో భారతీయ పారా బాడ్మింటన్‌ క్రీడాకారిణి పరుల్‌ పర్మ. అంతకుముందు వరకూ ఆమెతో పోరాడి నెగ్గింది లేదు. అయినా ఈసారి నెగ్గి తీరాలనే బలమైన పట్టుదల నాలో. ఏళ్లతరబడి అనుభవం గడించాను. కోర్టులో కదిలే వేగం, రాకెట్‌ను విసిరే నేర్పు, స్ట్రోక్స్‌… అన్నిట్లో స్పష్టత సాధించాను. మ్యాచ్‌ మొదలైంది. వరుసగా 13 పాయింట్లతో చివరి సెట్‌ను కైవసం చేసుకుని ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాను. ప్రమాదంతో వచ్చిపడిన వైకల్యంతో కుదేలైన ఆ రోజు నుంచి… ప్రపంచ ఛాంపియన్‌గా ఎదిగిన నాటి వరకూ జరిగిన ఎనిమిదేళ్ల ప్రయాణం నా జీవితంలో ఎంతో కీలకమైనది. ప్రమాదం తర్వాత నాకు జరిగిన నష్టం గురించి బాధపడిన సందర్భం ఒక్కటీ లేదు. కాలు పోగొట్టుకుని ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చాక, అద్దం ముందు నిలబడినప్పుడు… మొదటిసారి నేను బాగోలేను అనిపించినా, తర్వాత… ‘ఫర్వాలేదు. కాలు పోయింది, మచ్చ మిగలింది, అంతేగా!’ అనిపించింది.

రీహాబ్‌లో భాగంగా బాడ్మింటన్‌!
కృత్రిమ కాలుతో నడక సాధన మొదలుపెట్టాను. ఆ రిహాబిలిటేషన్‌లో భాగంగా నా చిన్ననాటి అభిరుచి బాడ్మింటన్‌ ఆడడం మొదలుపెట్టాను. ఆ క్రమంలో ఓ పారా బాడ్మింటన్‌ ప్లేయర్‌ దృష్టిలో పడ్డాను. ఓ కార్పొరేట్‌ టోర్నమెంట్‌లో ఎటువంటి వైకల్యం లేని వారిని నేను ఓడించడం చూసి, ఇండియన్‌ పారా బాడ్మింటన్‌ టీమ్‌లో ప్రవేశానికి ప్రయత్నించమని ఆ ప్లేయర్‌ ప్రోత్సహించారు. అలా కొన్ని పోటీల్లో పాల్గొని ఓటములూ చవిచూశాను. ఆడే సమయంలో తోటి క్రీడాకారులు, అభిమానులు వచ్చి పారా బాడ్మింటన్‌ క్రీడను ఎంచుకున్నందుకు అభినందిస్తూ ఉండడంతో ఈ క్రీడకే నా జీవితాన్ని అంకితం చేద్దామని నిర్ణయించుకున్నాను. అలా ఓ పక్క అలహాబాద్‌ బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే, మరోపక్క టోర్నమెంట్లు ఆడే సమయంలో ప్రముఖ బాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ మా బ్యాంకును సందర్శించారు. ఆయన ప్రతిభ గురించి విని ఉండడంతో నేరుగా ఆయన దగ్గరకు వెళ్లి ‘నాకు కోచింగ్‌ ఇస్తారా?’ అని అడిగాను. అందుకు ఆయన గట్టిగా నవ్వి, సరే అన్నారు.

ఆ క్రెడిట్‌ పుల్లెల గోపీచంద్‌దే!
బాడ్మింటన్‌ కోచింగ్‌ ఇవ్వడంలో మిగతా వాళ్లకూ, నాకూ తేడా ఉంది. కాబట్టి ఒక పారా అథ్లెట్‌కు కోచింగ్‌ ఇవ్వడం అనేది గోపీచంద్‌కు సవాలుగా మారింది. నా బలం, బలహీనతలను తెలుసుకోవడం కోసం ఆయన నా ఆటల వీడియోలు చూశారు. ఒంటి కాలితో బాడ్మింటన్‌ ఆడి, స్వయంగా నా ఇబ్బందుల పట్ల అవగాహన ఏర్పరుచుకున్నారు. తర్వాత నాకంటూ ప్రత్యేకమైన ట్రైనింగ్‌ షెడ్యూల్‌ రూపొందించి శిక్షణ ఇచ్చారు. అంత శ్రమపడ్డారు కాబట్టే స్విట్జర్లాండ్‌లో వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ దక్కించుకోగలిగాను. ఆ క్రెడిట్‌ గోపీచంద్‌కే దక్కుతుంది.

డబుల్స్‌ ఆడక తప్పదు!
పారాలింపిక్స్‌లో సింగిల్‌గా బాడ్మింటన్‌ ఆడే వీలు లేదు. కాబట్టి హర్యాణాకు చెందిన రాకేష్‌ పాండేతో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఆడాలనుకుంటున్నాను. 2015 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఇతనితో కలిసి ఆడి, కాంస్య పతకం సాధించిన అనుభవం ఉంది. కాబట్టి రాబోయే పోటీలకు అర్హత సాఽధించి, ఛాంపియన్‌షిప్‌ నెగ్గగలననే నమ్మకం ఉంది. ఫ

నాన్నే మొదటి కోచ్‌!
మా ఇంట్లో చదువకే తొలి ప్రాధాన్యం. కాబట్టే చదువులో రాణించి, 23 ఏళ్లకే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా కెరీర్‌ మొదలుపెట్టాను. అయితే నాకు ఆటలన్నా ప్రాణమే! ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌, బాడ్మింటన్‌ ఆడేదాన్ని. అన్నింట్లో నాకు బాడ్మింటన్‌ అంటే ఎక్కువ ఇష్టం. నాన్న ముంబయిలోని ప్రతిష్ఠాత్మక భాభా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో సైంటిస్ట్‌. ఆరేళ్ల వయసులో ఆయనే నాకు బాడ్మింటన్‌ నేర్పించారు. బ్యాట్‌ ఎలా పట్టుకోవాలో, షాట్‌ ఎలా కొట్టాలో నాన్నే నేర్పించారు. ఆయనే నా మొదటి కోచ్‌. అలా ఇష్టంగా, నేర్చుకున్న ఆట, ఇప్పుడిలా నన్ను ఛాంపియన్‌గా నిలబెడుతుందని ఊహించలేదు.

బార్బీ బొమ్మగా… 
నాకంటే ముందు భారత మహిళా జిమ్నాస్ట్‌ దీపా కర్మకార్‌ ప్రతిరూపంలో బార్బీ బొమ్మ రూపొందింది. షీరోస్‌ ఫిగర్‌గా భారతదేశం నుంచి బార్బీ బొమ్మ మోడల్‌గా ఎంపికైన రెండో మహిళను నేను. నా చామనఛాయ రంగు, పోనీ టెయిల్‌, కృత్రిమ కాలు… అచ్చు గుద్దినట్టు భలే తయారు చేశారీ బొమ్మను. ఎంతటి ఊహించని పరిణామాన్నైనా ఎదుర్కొని, జీవితంలో ఎదిగిన వైనాన్ని నా ప్రతిరూపమైన బార్బీ బొమ్మలో చూసి, ఆడపిల్లలు స్ఫూర్తి పొందితే నాకంతే చాలు!

Courtesy Andhrajyothi

Add a comment...