• బడ్జెట్‌ కేటాయింపుల్లో అట్టడుగున భారత్‌
  • 55 శాతం మందికే అత్యవసర వైద్య సేవలు
  • దేశంలో కరోనా విజృంభణకూ ఇదీ ఒక కారణం
  • ఆక్స్‌ఫాం నివేదిక వెల్లడి

దిల్లీ: ఆరోగ్యమే మహా భాగ్యమని ప్రవచించే భారత దేశంలో ఆ రంగానికి బడ్జెట్‌ కేటాయింపులు చూస్తే మాత్రం మహా దౌర్భాగ్యంగా ఉన్నాయి. ఏటా రూ.లక్షల కోట్లతో ప్రకటించే దేశ బడ్జెట్‌లో ఆరోగ్యానికి అందించే వాటా నామమాత్రంగా ఉంటోంది. ఈ విషయంలో పాకిస్థాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ లాంటి సాటి ఆసియా దేశాలే కాదు.. ప్రపంచంలోనే అత్యంత పేద దేశంగా ఉన్న ఆఫ్రికాలోని బురుంది కన్నా వెనకబడి ఉన్నట్లు తాజాగా విడుదలైన ఆక్స్‌ఫాం నివేదిక తేటతెల్లం చేసింది. దీని ప్రకారం 2017లో భారత్‌ తన మొత్తం బడ్జెట్‌లో 3.4 శాతం మాత్రమే ఆరోగ్య రంగానికి కేటాయించింది. ఈ కేటాయింపుల విషయంలో భారత్‌ ప్రపంచ దేశాల జాబితాలో 155వ స్థానంలో ఉంది. అట్టడుగు నుంచి 4వ స్థానంలో అఫ్ఘానిస్థాన్‌తో సమానంగా ఉండటం గమనార్హం. ప్రపంచ ప్రమాణాల ప్రకారం మొత్తం బడ్జెట్‌లో 15 శాతం ఆరోగ్యానికి కేటాయించాల్సి ఉండగా, భారత్‌ అందుకు ఆమడ దూరంలో ఉండటం విషాదకరం. దీనికితోడు దేశ జనాభాలో 55 శాతం మందికే అత్యవసర ఆరోగ్య సేవలు పొందగలుగుతున్నారని ఈ నివేదిక పేర్కొనడం ఆందోళన రేకెత్తిస్తోంది. ‘కమిట్‌మెంట్‌ టు రెడ్యూసింగ్‌ ఇన్‌ ఇక్వాలిటీ ఇండెక్స్‌ 2020’ పేరుతో ఆక్స్‌ఫాం విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో వైద్య సేవల కోసం చేసే మొత్తం వ్యయంలో 70 శాతం ఇంటి ఖర్చుల కోసం కేటాయించుకున్న సొమ్ము నుంచే వెచ్చిస్తున్నారు. ఈ విషయంలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది.

కరోనా విజృంభణకూ కారణమిదే
ఆరోగ్య రంగానికి ఎక్కువ కేటాయింపులు జరపకపోవడం కూడా దేశంలో కరోనా విజృంభణకు ఒక కారణమని ఆక్స్‌ఫాం వెల్లడించింది. దానివల్లే మహమ్మారిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా లేకపోవడంతో పాటు దాన్ని అరికట్టడంలో విఫలమైందని పేర్కొంది. కరోనాను సమర్థంగా నిలువరించలేకపోయిన దేశాల్లో భారత్‌ ఒకటని అభిప్రాయపడింది. దేశంలో ఉద్యోగుల స్థితిగతులు కూడా అధ్వానంగా ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘భారత్‌లో కార్మికుల హక్కులు బలహీనంగా ఉన్నాయి. వేతనాలు, హక్కులు, పని ప్రదేశాల్లో సౌకర్యాలను బట్టి చూస్తే 75 శాతం మంది ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. చాలా మంది ఉద్యోగులు కనీస వేతనంలో సగం కన్నా తక్కువే పొందుతున్నారు. 71 శాతం మంది ఎలాంటి ఉద్యోగ ఒప్పందాలు లేకుండానే పనిచేస్తున్నారు. 54 శాతం మందికి వేతనంతో కూడిన సెలవులు లేవు. 10 శాతం మందికి మాత్రమే ఉద్యోగ, సామాజిక భద్రత ఉంది’’ అని ఆక్స్‌ఫామ్‌ పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల వల్ల కరోనా సమయంలో ఎదురైన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడంలో విఫలమైంది అని ఆక్స్‌ఫామ్‌ వెల్లడించింది.

Courtesy Eenadu

Add a comment...