• కరోనా రోగుల బాగోగులను పర్యవేక్షించే యాప్‌ షట్‌డౌన్‌
  • నెల రోజుల్లో 6వేల రోగులకు ప్రయోజనం… రోగులు అసంతృప్తి
  • రెమ్యునరేషన్‌ ఇవ్వకుండానే 120 మంది వైద్యుల తొలంగిపు
  • యాప్‌ను మరింత బలోపేతం చేస్తాం: వైద్యాధికారులు
  •   రెండు రోజులుగా నిలిచిపోయిన సేవలు

హైదరాబాద్‌ :  ఇళ్లలోనే ఉంటూ చికిత్స పొందుతున్న కరోనా రోగుల బాగోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొబైల్‌ యాప్‌ ‘హోం ఐసొలేషన్‌ ట్రీట్మెంట్‌ అప్లికేషన్‌ మేనేజ్‌మెంట్‌(హితం) నెలరోజులకే బంద్‌ అయింది. రెండు రోజుల నుంచి దాని సేవలు ఆగిపోయాయి. కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను తీసుకువచ్చామని హైకోర్టుకు కూడా తెలిపిన సర్కారు, దాన్ని ప్రారంభించిన నెల రోజులకే మూలనపడేసింది. యాప్‌ సేవలు నిలిచిపోవడంపై కరోనా రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సరిగ్గా నెల రోజుల క్రితం ప్రారంభమైన ‘హితం’ సేవలు బాగా విజయవంతమయ్యాయి. కేంద్రం కూడా ఈ యాప్‌ సేవలను ప్రశంసించిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కరోనా రోగులు కూడా ఈ యాప్‌ సేవలను బాగా మెచ్చుకున్నారు. యాప్‌ ప్రవేశపెట్టిన నెలరోజుల్లోనే 6 వేల మంది కరోనా రోగులు సేవలు పొందారు.

యాప్‌ నిర్వహణ కోసం మొత్తం 120 మంది వైద్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కో వైద్యుడు 50 మంది రోగుల బాగోగులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. వారికి రోజూ ఆ వైద్యుడు ఫోన్‌ చేసి ఆరోగ్య వివరాలు తెలుసుకోవాలి. అందుకుగాను రోజుకు ఆ వైద్యుడికి రూ.1000 ప్రోత్సాహకం ఇస్తామని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 24 గంటల్లో ఎప్పుడైనా హోం ఐసొలేషన్‌లో ఉన్న కరోనా రోగుల ఆరోగ్యం విషమిస్తే.. యాప్‌లో ఉన్న అత్యవసర బటన్‌ నొక్కితే జీపీఎస్‌ ద్వారా నేరుగా 108కి సమాచారం వెళతుంది. రోగి ఇంటికే 20 నిమిషాల్లో 108 వాహనం వస్తుంది. ఇదే సమాచారం డాక్టర్‌కు యాప్‌ ద్వారా వెళ్తుంది.

అయితే ఈ యాప్‌ కింద పనిచేస్తున్న 120మంది వైద్యులకు చెల్లిస్తామన్న రెమ్యునరేషన్‌ ఇప్పటిదాకా ఇవ్వలేదు. రూ.4-5 వేలు చేతిలో పెట్టి తమను తొలగించారని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాప్‌ను ఎత్తివేసి, వైద్యుల కోసం పెట్టిన వాట్సప్‌ గ్రూపును తొలగించారని ఓ డాక్టర్‌ వెల్లడించారు.

అయితే, ‘హితం’ యాప్‌ సేవలు నిలిచిపోలేదని, దాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెప్పారు. ఇప్పటిదాకా మొబైల్‌ యాప్‌గా ఉన్న దాన్ని వెబ్‌ వెర్షన్‌(డెస్క్‌టా్‌ప)కు తీసుకువస్తున్నామని చెప్పారు. ఇప్పటిదాకా హితం యాప్‌ కోసం ప్రైవేటు వైద్యుల సేవలను వినియోగించుకున్నామని, ఇక నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే డాక్టర్ల సేవలను వాడుకుంటామని అంటున్నారు.

ఆర్బీఎస్కే పరిధిలో 400మంది వైద్యులు పనిజేస్తున్నారని, వారందర్నీ ఆ యాప్‌ సేవలకు వినియోగిస్తామని పేర్కొన్నారు.

Courtesy Andhrajyothi

Add a comment...