తుపాకీ! ఈ మాట వినగానే అయ్యబాబోయ్‌! అని గుండెల మీద చేతులేసుకునే మహిళలే ఎక్కువ! కానీ నిజానికి ప్రత్యేకంగా మహిళల కోసమే తయారయ్యే తుపాకులూ ఉన్నాయి. వాటి విక్రయ వృత్తి నిర్వహించే మహిళలూ ఉంటారు. తుపాకులతో సహవాసం చేస్తూ, వాటి చుట్టూ తిరిగే భిన్నమైన కెరీర్‌ను ఎంచుకుందో మహిళ. రివాల్వర్లు, షాట్‌గన్స్‌, పిస్టల్స్‌… వీటి గురించి అనర్గళంగా వివరించగలిగే ముత్యాల రత్నకుమారి నవ్యతో పేల్చిన కొన్ని గన్‌ షాట్స్‌!

తుపాకులకూ మహిళలకూ పొత్తు కుదరదు. సినిమాల్లో తప్ప గన్స్‌ను ప్రత్యక్షంగా చూసే పరిస్థితే ఉండదు. అలాంటిది ఊహించని విధంగా నేను గత 11 ఏళ్లుగా తుపాకులతో కూడిన వృత్తిలోనే కొనసాగుతున్నాను. మావారు 2003లో కేన్సర్‌తో మరణించడంతో కుటుంబబాధ్యత నా మీద పడింది. పదో తరగతి విద్యార్హతతో ఉద్యోగం దొరకడం కష్టంగా మారిన సమయంలో స్నేహితురాలి రికమండేషన్‌తో ఆర్మరీ షాపులో సేల్స్‌ గర్ల్‌గా చేరాను. కస్టమర్లకు వాటి పనితీరు గురించి వివరించడం నా ప్రధాన బాధ్యత. ప్రారంభంలో వాటిని తాకాలంటే గుండెలు దడదడలాడేవి. కానీ నా వృత్తి అదే కాబట్టి ధైర్యం కూడదీసుకుని ఒక్కొక్కటీ నేర్చుకున్నాను. వాటి లోడింగ్‌, అన్‌లోడింగ్‌, విడి భాగాలు, మరమ్మతులూ… ఇలా తుపాకులకు సంబంధించిన ప్రతి విషయం మీదా పట్టు సాధించాను.

నాలుగు రకాలు
రివాల్వర్‌, పిస్టల్‌, రైఫిల్‌, 12 బోర్‌, ఎయిర్‌గన్స్‌, హ్యాండ్‌ గన్స్‌, షాట్‌ గన్స్‌,… ఇలా ఆర్మరీ షాపులో పలు రకాల తుపాకులు ఉంటాయి. వీటి కోసం వాడే బులెట్స్‌ కూడా వేర్వేరు ఉంటాయి. ఈ తుపాకులు, బుల్లెట్స్‌, తూటాల కొనుగోళ్ల కోసం కస్టమర్లు వచ్చినప్పుడు వాళ్ల లైసెన్స్‌లు పరీక్షించడం, అవసరమైన తుపాకులు చూపించడం నా పని. లైసెన్స్‌ కలిగిన ప్రతి వ్యక్తికీ వాళ్లు వాడే బుల్లెట్స్‌కు ఓ పరిమితి ఉంటుంది. ఆ పరిమితికి మించి బుల్లెట్స్‌ విక్రయించకూడదు. కాబట్టి ఆ లెక్కను జాగ్రత్తగా గమనించి, విక్రయించిన బుల్లెట్స్‌ వివరాలు లైసెన్స్‌ బుక్‌లో, రిజిస్టర్‌లో నమోదు చేస్తాను. అలాగే తుపాకుల మరమ్మతులూ, సర్వీసింగ్‌ కూడా చేయిస్తాను. కొన్నిసార్లు విడి భాగాలు సమయానికి దొరకక, రిపేర్‌ ఆలస్యమై, కస్టమర్ల అసహనానికి గురయిన సందర్భాలూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ తుపాకులతో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎయిర్‌గన్స్‌ లాంటివి లోడ్‌ చేసే సమయంలో పొరపాటున ట్రిగ్గర్‌ నొక్కుకుపోతే, బ్యారెల్‌ వెనక్కి విసురుగా తగిలి, గాయాలయ్యే ప్రమాదమూ ఉంటుంది. కాబట్టి వాటిని కస్టమర్లకు చూపించే సమయంలో ఎంతో జాగ్రత్తగా, అప్రమత్తంగా నడుచుకుంటూ ఉంటాను.

మా కస్టమర్లలో వాళ్లే ఎక్కువ!
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు… ఇలా మా కస్టమర్లలో రాజకీయ నాయకులే ఎక్కువ. బడా వ్యాపారవేత్తలు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలో ఉన్నవారు, ల్యాండ్‌ లార్డ్స్‌, క్రీడాకారులు, ఐపిఎస్‌, ఐఎఎస్‌ ఆఫీసర్లు కూడా మా కస్టమర్లలో ఉన్నారు. వీళ్లలో ఎక్కువ శాతం కొత్త గన్స్‌ కొనుగోలు లేదా మార్పిడి చేస్తూ ఉంటారు. గన్‌ లైసెన్స్‌ పొందిన మహిళలు, లేదా భర్త మరణించడంతో లైసెన్స్‌ తమ పేరు మీదకు మార్చుకున్న మహిళలు రివాల్వర్లు, పిస్టల్స్‌ కొనుగోలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. చిన్నపాటి పిల్లెట్స్‌తో తక్కువ గాయాన్ని కలగజేసే ఎయిర్‌ పిస్టల్స్‌ పరిమాణంలో చిన్నవిగా ఉండడంతో ప్రత్యేకించి మహిళలు వీటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. వీటిని పేల్చకపోయినా, చూపిస్తే చాలు! దుండగులు తమ జోలికి రాకుండా ఉంటారనే ఆలోచనతో ఇలాంటి ఎయిర్‌గన్స్‌ కొనుగోళ్లు జరుగుతూ ఉంటాయి.
– గోగుమళ్ల కవిత

గన్‌… ఫన్‌ కాదు!  
మహిళలు భద్రత కోసం తుపాకుల మీద ఆధారపడడం సరి కాదు. తుపాకుల విక్రయం కోసం గన్‌ లైసెన్స్‌ పొందడం కూడా అంత సులువేమీ కాదు. తమ ప్రాణాలకు భద్రత అవసరమని ఆధారాలతో సహా నిరూపించగలిగిన తర్వాతే గన్‌ లైసెన్స్‌ మంజూరు చేస్తాం. ఇందుకోసం ఎస్‌.పి లేదా పోలీసు కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. మహిళల కోసం ప్రత్యేకంగా తయారవుతున్న తుపాకులు ఉన్నాయి. తక్కువ బరువుతో, చేతిలో చక్కగా ఇమిడిపోయే ఈ రివాల్వర్లు ఉపయోగించడం కూడా తేలిక. అయితే తుపాకీ ప్రాణరక్షణకే కాదు ప్రాణం తీయడానికీ ఉపయోగపడుతుందనే విషయం గ్రహించాలి. దాడి జరిగే సమయంలో తుపాకీ తో బెదిరించబోతే, దాన్ని మహిళ చేతిలో నుంచి లాక్కుని దుండుగులు కాల్పులకు తెగబడే ప్రమాదమూ లేకపోలేదు. కాబట్టి తుపాకీ లైసెన్స్‌ పొందడంతోనే బాధ్యత ముగియదు. దాని రక్షణ కూడా ఎంతో అవసరం. ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా గన్‌ను భద్రపరుచుకోవడం కూడా ఎంతో కీలకం. అలాగే గన్‌ను కొనుగోలు చేయడంతో ఆగిపోకుండా దాన్ని లోడ్‌, అన్‌లోడ్‌ చేయడం, గురి పెట్టి కాల్చడం నేర్చుకోవాలి. గన్‌ను భద్రంగా ఉంచుకోవడం అన్నిటికంటే ముఖ్యం.
శిఖా గోయల్‌,
అడిషనల్‌ పోలీస్‌ కమిషనర్‌, హైదరాబాద్‌. 

మహిళల కోసం ప్రత్యేకమైన తుపాకీ!
నిర్భయ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మహిళల కోసం తుపాకుల తయారీ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం కూడా మహిళలకు లైసెన్స్‌ల పరిమితి పెంచింది. దాంతో తుపాకీలు కొనుగోలు చేసే మహిళల సంఖ్య 5ు నుంచి 7ు పెరిగింది. ఎమ్మెల్యేలు, ఎంపీల భార్యలతో పాటు, హైదరాబాద్‌లో ఈ ఏడాది ఇద్దరు మహిళలు గన్‌ లైసెన్స్‌ పొందారు. వారిలో ఒకరు జవహర్‌నగర్‌ మేయర్‌. నిడార్‌ పిస్టల్‌ (.22 క్యాలిబర్‌) రివాల్వర్‌, ఆషానీ (.32 క్యాలిబర్‌) పిస్టల్‌, నిర్భీక్‌ (32 బోర్‌) మహిళల కోసం ఉద్దేశించినవి. వీటి ట్రిగ్గర్‌ నొక్కడం తేలిక. ఇవన్నీ మహిళల చేతిలో చక్కగా ఇమిడిపోతాయి. సుమారు 250 నుంచి 500 గ్రాముల బరువుండే ఈ తుపాకీలు పర్సులో ఇమిడిపోయే పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. అయితే తుపాకీ లైసెన్స్‌ పొందలేని మహిళలు వీటికి బదులుగా బాంటెన్‌ స్టిక్స్‌, పెప్పర్‌ స్ర్పే, అలారం కీచైన్‌ మొదలైన స్వీయరక్షణ వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. సెల్ఫ్‌ ప్రొటెక్షన్‌ కోసం ఇవి కూడా సమర్థంగా ఉపయోగపడతాయి. మాది నిజాం పాలన నుంచీ నడుస్తున్న కుటుంబ వ్యాపారం. ప్రస్తుతం జి.హెచ్‌.ఎం.సి ఎన్నికల సమయం. ఎలాంటి ఎన్నికల సమయంలోనైనా మేం విక్రయించిన తుపాకులన్నిటినీ మా దగ్గర జమ చేయించుకోవలసి ఉంటుంది. వీటిని ఎన్నికల ఫలితాలు విడుదల అయిన తర్వాతే వాళ్లకు తిరిగి అప్పగిస్తాం. ఈ నియమం 1966 నుంచీ అమల్లోకి వచ్చింది.
జి.కె ఖలీక్‌, ఆర్మ్స్‌ డీలర్‌,
టార్గెట్‌ పాయింట్‌, హైదరాబాద్‌.

Courtesy Andhrajyothi

Add a comment...