• గుండెపోటుతో మరణించిన ఫుట్‌బాల్‌ దిగ్గజం మారడోనా
  • బ్యూనస్‌ఎయిర్స్‌

దుఖః సాగరంలో సాకర్‌ ప్రపంచం. క్రీడా చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం తన ఆఖరి పేజీ రాసేసుకుంది. అద్వితీయమైన ఆటతో, విలక్షణ వ్యక్తిత్వంతో ఫుట్‌బాల్‌ ప్రేమికులను అనంతమైన వినోదంలో ఓలలాడించి, ఉర్రూతలూగించి అంతులేని వినోదాన్ని పంచిన  సమ్మోహనశక్తి మరో లోకాన్ని అలరించడానికి వీడ్కోలు తీసుకుంది. ఆటకే మారుపేరుగా మారిన మాంత్రికుడు డీగో మారడోనా ఇక లేడు. ఎన్నోసార్లు తీవ్ర అనారోగ్యం పాలైనా.. చిరుత లాంటి పరుగుతో ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించినట్లు ఛేదించిన ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఈసారి మాత్రం పైచేయి సాధించలేకపోయాడు. ఆరు పదుల వయసులో గుండెపోటుతో కన్నుమూశాడు. కానీ ఎన్నో మంత్రముగ్దమైన గోల్స్‌తో ఎన్నో తీపి జ్ఞాపకాలను అందించిన డీగో.. అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ సజీవమే.

ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా మరి లేడు. అద్భుతమైన ఆటతో ప్రపంచ ఫుట్‌బాల్‌ను సుసంపన్నం చేసిన ఈ మేటి ఆటగాడు బుధవారం గుండెపోటుతో మరణించాడు. కళ్లు చెదిరే విన్యాసాలతో 1986లో అర్జెంటీనాకు ప్రపంచకప్‌ను అందించిన డీగో.. కొకైన్‌ వాడకం, ఊబకాయంతో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. మెదడుకు శస్త్రచికిత్స తర్వాత రెండు వారాల కిందే అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. మారడోనా మృతి చెందడంతో అర్జెంటీనా ప్రభుత్వం మూడు సంతాప దినాలను ప్రకటించింది.
1986 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో క్వార్టర్‌ఫైనల్లో చేసిన ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ గోల్‌తో గుర్తుండిపోయే డీగో అర్మాండో మారడోనా 20 ఏళ్లకు పైగా అభిమానులను అలరించాడు. పోట్లగిత్తను తలపించే దూకుడుతో, ప్రత్యర్థులను చాకచక్యంగా బోల్తా కొట్టించే నైపుణ్యంతో మారడోనా ప్రపంచవ్యాప్తంగా ఆరాధ్యుడిగా మారాడు. సాకర్‌ను పిచ్చిగా ప్రేమించే అర్జెంటీనాలో అతణ్ని ‘గోల్డెన్‌ బాయ్‌’గా పిలుస్తారు. పదో నంబర్‌ జెర్సీ అంటే గుర్తొచ్చేది మారడోనానే. బ్రెజిల్‌ దిగ్గజం పీలే కూడా అదే నంబర్‌ జెర్సీతో ఆడేవాడు. ఎటాకింగ్‌లో డీగో దిట్ట. మెరుపు వేగంతో కదులుతూ, ఒక కాలి నుంచి ఇంకో కాలికి వేగంగా బంతిని అలవోకగా మార్చుకుంటూ సాగే అతణ్ని అంచనా వేయడం ప్రత్యర్థి ఆటగాళ్లకు చాలా కష్టంగా ఉండేది. ఎడమ పాదం అతడి బలమైన ఆయుధం. తరచూ దాంతో గోల్స్‌ చేస్తూ ప్రత్యర్థులను దిగ్భ్రాంతికి గురి చేసేవాడు. పొట్ట పెరగడంతో క్రమంగా అతడి వేగం తగ్గింది. 1991లో డోపింగ్‌ కుంభకోణం అతడికి పెద్ద దెబ్బ. కొకైన్‌కు అలవాటు పడ్డట్లు అప్పుడు అతడు అంగీకరించాడు. 37వ ఏట, 1997లో రిటైరయ్యేంత వరకు ఆ కుంభకోణం అతణ్ని వెంటాడింది. విపరీతంగా బరువు పెరగడం, డ్రగ్స్‌ తీసుకోవడంతో 2000లో మృత్యుముఖంలోకి వెళ్లాడు. కొకైన్‌ వాడకం కారణంగా 2004లోనూ హృదయ సంబంధ సమస్యలను ఎదుర్కొన్నాడు. తాను డ్రగ్‌ సమస్యను అధిగమించినట్లు ఆ తర్వాత అతడు ప్రకటించాడు. కొకైనే తనకు అత్యంత కఠిన ప్రత్యర్థి అని ఓ సందర్భంగా చెప్పాడు. 2005లో శస్త్రచికిత్సతో బరువు తగ్గిన బరువు తగ్గినా ఆరోగ్య సమస్యలు అతణ్ని వెంటాడాయి. అతిగా మద్యం తాగడం, తినడంతో 2007లో మరోసారి ఆస్పత్రిపాలయ్యాడు. ఆ తర్వాత 2008లో అర్జెంటీనా కోచ్‌గా బాధ్యతలు అందుకున్నాడు. కానీ 2010 ప్రంపచకప్‌ క్వార్టర్‌ఫైనల్లో పరాజయంతో అతడి పదవి పోయింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన మారడోనా ఫుట్‌బాల్‌లో ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. ఫిఫా.. 2001లో పీలేతో పాటు అతణ్ని ఫుట్‌బాల్‌ చరిత్రలో మేటి ఆటగాడిగా ప్రకటించింది. డీగో.. 1986 ప్రపంచకప్‌ గెలిచిన అర్జెంటీనా జట్టు కెప్టెన్‌. అర్జెంటీనా తరఫున అతడు 91 మ్యాచ్‌ల్లో 34 గోల్స్‌ కొట్టాడు.

పూర్తి పేరు: డిగో అర్మాండో మారడోనా
పుట్టిన రోజు: 1960 అక్టోబరు 30
జన్మస్థలం: లానస్‌, బ్యూనస్‌ ఎయిర్స్‌, అర్జెంటీనా
ఆట శైలి: అటాకింగ్‌ మిడ్‌ఫీల్డర్‌, సెకండ్‌ స్ట్రైకర్‌
జాతీయ జట్టుకు: 1977-94 మధ్య అర్జెంటీనాకు
91
మ్యాచ్‌లు ప్రాతినిధ్యం వహించి 34 గోల్స్‌ చేశాడు.

ఆ రెండు గోల్స్‌
55 మీటర్ల దూరాన్ని పూర్తి చేయడానికి మామూలుగా పరుగెత్తినా పది క్షణాలు పడుతుంది.  ఆ పది క్షణాల్లో.. 11 మంది ప్రత్యర్థి ఆటగాళ్లను దాటుకుంటూ.. ఏ ఒక్కరికీ బంతిని చిక్కనివ్వకుండా నియంత్రిస్తూ.. ఇవతలి గోల్‌ పోస్టు నుంచి అవతలికి వెళ్లి గోల్‌ కొట్టడం అంటే మాటలు కాదు. 1986 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై డీగో చేసిన ఈ విన్యాసానికి ఫుట్‌బాల్‌ ప్రపంచం విస్తుబోయింది. దశాబ్దాలు గడిచాక కూడా ఇప్పటికీ ఆ గోల్‌ ఓ అద్భుతంగానే కనిపిస్తుంది. దీన్ని ఫిఫా ‘శతాబ్దపు అత్యుత్తమ గోల్‌’గా గుర్తించింది. ఇదే మ్యాచ్‌లో మారడోనా చేసిన మరో గోల్‌ కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. తనదైన డ్రిబ్లింగ్‌ మాయాజాలంతో ప్రత్యర్థులందరినీ బోల్తా కొట్టిస్తూ ఈ గోల్‌ సాధించే క్రమంలో ఒక చోట బంతికి డీగో చేయి తాకిందన్నది ఆరోపణ. కానీ ఇందుకు వీడియో ఆధారాలు దొరకలేదు. ఈ విషయాన్ని మారడోనా దగ్గర ప్రస్తావిస్తే.. బహుశా బంతిని తాకింది దేవుడి చేయి అయి ఉంటుందన్న అర్థం వచ్చేలా మాట్లాడాడు. మామూలుగా మారడోనా ఆట మాత్రమే చర్చనీయాంశం. కానీ ఆ రోజు అతడి మాట కూడా సంచలనం రేపింది. అందుకే ఈ గోల్‌ను ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’గా అభివర్ణిస్తారు. ఈ మ్యాచ్‌లో మారడోనా ఒంటి చేత్తో అర్జెంటీనా (2-1)ను గెలిపించి సెమీస్‌కు తీసుకెళ్లాడు. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి కప్పు కూడా సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో కెప్టెన్‌ కూడా అయిన డీగో.. అర్జెంటీనాకు రెండో ప్రపంచకప్‌ అందించి చరిత్రకెక్కాడు. ఆ టోర్నీలో గోల్డెన్‌ బాల్‌ పురస్కారం కూడా డీగో సొంతమైంది. అతడి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. పీలేను మించిన ఆదరణతో, ప్రపంచ సాకర్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడిగా డీగో గుర్తింపు తెచ్చుకున్న సందర్భమది!

ఆట  అద్భుతమే కానీ..
ఆటగాడిగా డీగోకు ఎంత గొప్ప పేరుందో.. వ్యక్తిగా అంత చెడ్డ పేరుంది. ఆటలో ఉండగానే అతను మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడు. పలుమార్లు క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్నాడు. చివరగా ఆడిన 1994 ప్రపంచకప్‌లోనూ అర్ధంతరంగా జట్టుకు దూరం కావడానికి డ్రగ్సే కారణం. 1991లో మాదక ద్రవ్యాలు తీసుకున్నందుకు 15 నెలల పాటు ఆట నుంచి బహిష్కృతుడయ్యాడు. రిటైరయ్యాక డీగో పూర్తిగా మాదక ద్రవ్యాలు, మద్యం మత్తులో కూరుకుపోయాడు. చూస్తుండగానే అతడి అవతారం మారిపోయింది. ఆరోగ్య సమస్యలు చుట్టు ముట్టాయి. పలుమార్లు ఆసుపత్రి పాలయ్యాడు. అనేక వివాదాలు, అమ్మాయిలతో శృంగార కార్యకలాపాలతో పలుమార్లు డీగో వార్తల్లో నిలిచాడు. కానీ ఏ దశలోనూ అతను ఆటకు మాత్రం దూరం కాలేదు. చనిపోవడానికి ముందు కూడా అర్జెంటీనాకు చెందిన జిమ్నాసియా క్లబ్‌కు మేనేజర్‌గా ఉన్నాడు. అయితే వ్యక్తిగా ఎన్ని తప్పటడుగులు వేసినా.. ఫుట్‌బాల్‌ ప్రపంచం అతణ్ని ఎప్పటికీ ఓ దిగ్గజంగానే గుర్తుంచుకుంటుంది. మైదానంలో అతను చూపించిన విన్యాసాలు, ఆవిష్కరించిన అద్భుతాలు అలాంటివి మరి!

అప్పట్లోనే  43 కోట్లు
ఓ ఫుట్‌బాల్‌ స్టార్‌ కోసం ఓ క్లబ్‌ మరో క్లబ్‌కు వందలు, వేల కోట్లు చెల్లించడం చూస్తున్నాం. ఈ భారీ లావాదేవీలు మొదలైంది మారడోనాతోనే. 90వ దశకంలో నపోలి క్లబ్‌కు 5 మిలియన్‌ యూరోలు (దాదాపు రూ.43 కోట్లు) చెల్లించి బార్సిలోనా మారడోనాను సొంతం చేసుకోవడం విశేషం. ఆ రోజుట్లో ఫుట్‌బాల్‌ వర్గాల్లో అదో సంచలనం. ఇప్పటి విలువలో ఆ మొత్తం వేల కోట్లతో సమానం!

ఫిఫా ప్లేయర్‌ ఆఫ్‌ ది సెంచరీ
20వ శతాబ్దపు అత్యుత్తమ ఫుట్‌బాల్‌ ఆటగాడు ఎవరన్నది తేల్చేందుకు ‘ఫిఫా ప్లేయర్‌ ఆఫ్‌ ది సెంచరీ’ అవార్డును సృష్టించగా.. పీలేతో కలిసి మారడోనా దాన్ని గెల్చుకున్నాడు. ఇంటర్నెట్‌ పోల్‌లో అత్యధిక ఓట్లు సాధించడం ద్వారా మారడోనా విజేతగా నిలవగా.. ఫిఫా అధికారులు, పాత్రికేయులు, కోచ్‌ల ఓట్ల ఆధారంగా పీలే సంయుక్త విజేతగా అవతరించాడు.

శృంగార పురుషుడు
డిగో మారడోనా సీనియర్‌, డాల్మా సాల్వడోరా ఫ్రాంకోలకు రోమన్‌ క్యాథలిక్‌ కుటుంబంలో మారడోనా పుట్టాడు. 1989 నవంబరు 7న క్లాడియా విల్లాఫేన్‌ను పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు. 2004లో ఈ జంట విడాకులు తీసుకుంది. ఆ తర్వాత పలువురు మహిళలతో సంబంధాలు నెరిపాడు. చివరిగా ఆయన తన కంటే 30 సంవత్సరాలు చిన్నదైన రోసియో ఒలివాతో డేటింగ్‌ చేశాడు.

పీలే × మారడోనా
పుట్‌బాల్‌ చరిత్రలో గొప్ప ఆటగాడు ఎవరు అనే చర్చ వస్తే ఎప్పుడు ముందుండే పేర్లు పీలే, మారడోనా. పీలే మూడు సార్లు ప్రపంచకప్‌ గెలిపించగా, మారడోనా 1986లో జట్టును విజయతీరాలకు చేర్చాడు. 1990 ఫైనల్‌లో అర్జెంటీనా ఓడిపోయింది. ఒకే శకంలో ఆడకపోయినప్పటికీ.. ఈ ఇద్దరికి ఎప్పుడు మాటల యుద్ధం జరుగుతూనే ఉండేది. పలు సందర్భాల్లో బాహాటంగానే విమర్శల వర్షం కురిపించుకునేవారు.

మేమిద్దరం ఆకాశంలో ఫుట్‌బాల్‌ ఆడతాం!
నేను ఆప్త మిత్రుణ్ని కోల్పోయా. ప్రపంచం ఓ దిగ్గజాన్ని కోల్పోయింది. ఈ విషాద సమయంలో మారడోనా కుటుంబానికి మానసిక స్థైర్యాన్నివ్వాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా. ఏదో ఒక రోజు మేమిద్దరం కలిసి ఆకాశంలో ఫుట్‌బాల్‌ ఆడతామని ఆశిస్తున్నా.
        – పీలే

 2000లో ‘యో సోయ్‌ ఈ డీగో’ పేరిట మారడోనా ఆత్మకథను ప్రచురించాడు. దీనర్థం నేనే డిగో. దీనిపై వచ్చిన క్యూబా రాయల్టీలను ఆ దేశ ప్రజలకు విరాళంగా ఇచ్చాడు డీగో.
 1977 ఫిబ్రవరి 27న హంగేరీతో జరిగిన మ్యాచ్‌లో డీగో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అప్పటికి అతడి వయసు 16 మాత్రమే.

 మారడోనా మణికట్టుపై చేగువేెరా టాటూ ఉంటుంది. ఎడమ కాలి మీద క్యూబా నేత ఫిడెల్‌ క్యాస్ట్రో చిత్రాన్ని సైతం టాటూ వేయించుకున్నాడు.
 సెర్బియాకు చెందిన ఎమిర్‌ కస్టూరికా అనే దర్శకుడు మారడోనాపై డాక్యుమెంటరీ తెరకెక్కించాడు. 2008 కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో దీన్ని ప్రదర్శించారు.

4

మారడోనా అర్జెంటీనా తరఫున నాలుగు ప్రపంచ కప్‌ల్లో 21 మ్యాచ్‌ల్లో పోటీపడ్డాడు.

నా హీరో ఇక లేడు. నువ్వొక అద్భుత మేధావివి. ఇక ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో. నీ కోసమే నేను ఫుట్‌బాల్‌ చూశా.
సౌరవ్‌ గంగూలీ

ఫుట్‌బాల్‌తోపాటు యావత్‌ క్రీడా ప్రపంచం ఓ గొప్ప క్రీడాకారుణ్ని కోల్పోయింది. రెస్ట్‌ ఇన్‌ పీస్‌ డీగో  మారడోనా. నిన్ను మిస్సవుతాం.
సచిన్‌

Courtesy Eenadu

Add a comment...