కందారపు మురళి

‘దేవుడి ముందు అందరూ సమానులే’ అని వింటుంటాం. తిరుమల వెంకన్న ముందు అది అమలు కావడం లేదు. 1936లో టిటిడి పాలక మండలి ఏర్పడింది మొదలు 84 ఏళ్లలో ఇప్పటి వరకూ టిటిడి ఛైర్మన్‌, ఇ.ఓ, తిరుమల జెఇఓ, తిరుమల ఆలయ డిప్యూటీ ఇఓలుగా దళితులు ఎంపిక కాలేదంటే కుల వివక్ష ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.

ఈ నెల 9వ తేదీన టిటిడి 26వ ఇ.ఓ గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జవహర్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఈ చర్చ ముందుకు వచ్చింది. 1936 వరకు మహంతుల ఆధీనంలో టిటిడి నిర్వహించబడేది. 1932 నుండి టిటిడి పరిపాలన ప్రభుత్వ పరిధి లోకి వచ్చింది. 1936లో పి.వెంకటరంగ రాయన్‌ మొదటి ఛైర్మన్‌గా, 1933లో కె.సీతారామి రెడ్డి మొదటి కమిషనర్‌గా (ఇఓకు ముందు కమిషనర్‌) బాధ్యతలు స్వీకరించింది మొదలు నేటికి 50 మంది ఛైర్మన్లు, 26 మంది ఇ.ఓ.లు మారారు. వీరిలో దళితుడు ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడం విస్మయం కలిగిస్తుంది.

టిటిడి ఛైర్మన్‌, ఇ.ఓ.లుగానే కాదు, తిరుమల జె.ఇ.ఓ, ఆలయ డిఫ్యూటీ ఇ.ఓ.లుగా సైతం దళితులు నియమించబడలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తిరుపతి జె.ఇ.ఓ (పరిపాలనా)లుగా దళితులు పలువురు పని చేశారు. అత్యంత కీలకమైన తిరుమల జె.ఇ.ఓ (తిరుమల ఆలయ నిర్వహణ) పోస్టులో మాత్రం ఇప్పటి వరకూ దళితులు పని చేయలేదు.

1987 – 90 మధ్య కాలంలో సిహెచ్‌ వెంకటపతి రాజు ఇ.ఓ గా ఉన్న సమయంలో భూతలింగం అనే దళిత ఐఏఎస్‌ను తిరుమల జె.ఇ.ఓ గా ప్రభుత్వం నియమించింది. రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఈయన బాధ్యతలు స్వీకరించేందుకు తిరుమల వెళ్లారు. ఇ.ఓ వెంకటపతి రాజును కలిశారు. అప్పటికే తిరుమల ఆలయ అర్చకులు భూతలింగం బాధ్యతలు తీసుకోవటానికి వీల్లేదని తేల్చి చెప్పారు. తిరుమల జెఇఓ కు వివిధ పూజాధికాలలో చేతికి కంకణం కట్టాల్సి వస్తుందని, ఒక దళితునికి కంకణం తాము కట్టలేమని తేల్చి చెప్పారు. ఏవిూ పాలుపోని వెంకటపతి రాజు తిరిగి ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ లేఖను భూతలింగం చేతిలో పెట్టి వెనక్కు పంపారు. ఉదయం వచ్చిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ లోనే సాయంత్రానికి కళ్ల నీళ్లు పెట్టుకుని భూతలింగం తిరుగు ప్రయాణమైన ఘటన ఇప్పటికీ తిరుపతిలో చర్చనీయాంశమే.

హిందువుల మనో భావాలు దెబ్బ తింటున్నాయని డిక్లరేషన్‌ అంశం విూద నానా యాగీ చేసిన బిజెపి అసంఖ్యాకంగా ఉన్న దళిత హిందువుల మనోభావాలు దెబ్బ తింటుంటే మాత్రం నోరు మెదపటం లేదు ఎందుకని?

పూర్వం తిరుమల కొండకు దళితులు రావాలని ప్రయత్నిస్తే శిలలు అయిపోతారని ప్రచారం చేసేవారు. ఈ నియమాన్ని ఉల్లంఘించారని అలిపిరి పాదాల మండపం వద్ద మాల దాసరి, ఆయన కుటుంబ సభ్యులు శిలలు అయిపోయారని గుర్తుగా చూపుతుంటారు. దళితులు కొండకు వెళ్లినంత పుణ్యం సంపాదించాలంటే కొండకు వెళ్లాల్సిన అవసరం లేదని, అలిపిరి పాదాల మండపానికి ఎగువన ఉన్న తలతాకిడి గుండును (పెద్ద బండరాయి) తాకితే చాలని ప్రచారం చేశారు. ఈ తలతాకిడి గుండు నేటికీ వివక్ష రూపానికి సజీవ సాక్ష్యంగా కనబడుతుంది.

దళితులను తిరుమల కొండకు రానివ్వటం లేదని నాడు జాతిపిత మహాత్మాగాంధీ తెలుసుకున్నారు. జాతీయోద్యమంలో భాగంగా తిరుపతికి వచ్చిన ఆయన దళితులను వెంటేసుకుని తిరుమల వెళ్లటానికి సన్నద్ధమయ్యారు. దర్శనాల విషయంలో మార్పులు చేస్తామని బ్రిటిష్‌ ఉన్నతాధికారులు, పూజారులు గాంధీకి విజ్ఞప్తి చేయటంతో విరమించుకున్నారు. ఆ తరువాతి రోజుల్లోను ఈ సమస్యపై ఆందోళనలు సాగాయి. నాడు ప్రత్యక్షంగా వివక్ష కనపడేది. నేడు పరోక్షంగా వివక్ష రూపం కనబడుతున్నది.
వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలో ‘దళిత గోవిందం’ అనే కార్యక్రమం నిర్వహించారు. వెంకటేశ్వర స్వామిని దళితులకు చేరువ చేయాలన్న ఉద్దేశం తమదని ప్రకటించారు. దళిత కాలనీలకు ఉత్సవ విగ్రహాలు కాకుండా డమ్మీ విగ్రహాలను తీసుకెళ్లారు. దళితుల నుంచి పూజలందుకున్న విగ్రహాలను స్టోర్‌ రూముల్లో పడేశారు. ఈ అంశంపై గతంలో కెవిపిఎస్‌, దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.

టిటిడిలో వివక్ష పలు రూపాలలో నేటికీ కొనసాగుతూనే ఉంది. ప్రసాదాలు తయారు చేసే పోటు విభాగంలో వైష్ణవ బ్రాహ్మణులు మాత్రమే పని చేయాలని గతంలో ఇ.ఓ గా పని చేసిన ఐ.వై.ఆర్‌.క్రిష్ణారావు వివాదాస్పద ఆదేశం వెలువరించారు. నేటికీ ప్రసాదాల తయారీ విభాగంలో బ్రాహ్మణులు మాత్రమే పని చేస్తున్నారు.

ప్రసాదాలు తయారు చేసిన తర్వాత ‘ట్రే’లను లారీలో ఎక్కించే కూలీలు మాత్రం అత్యధికులు దళితులే. వివాదాస్పదమైన ఈ అంశాలపై పలు ఆందోళనలు జరిగాయి.
హిందువుల మనోభావాల పేరుతో దేశమంతటా బిజెపి, సంఘ పరివార్‌ నేతలు గొంతు చించుకుని మాట్లాడుతున్నారు. వివక్షకు గురవుతున్న దళిత హిందువుల గురించి కానీ, పదవుల నియామకాలలో కొనసాగుతున్న వివక్షపై నోరెత్తటం లేదు ఎందుకు?

దళితులు హిందువులలో భాగంగా బిజెపి పరిగణిస్తోందా లేదా? అంటరానితనాన్ని, కుల వివక్షతను బిజెపి వ్యతిరేకించడం నిజమే అయితే తిరుమల లోని వివక్షతపై తన వైఖరిపై స్పష్టం చేయాలి. ఈ వివక్షత టిడిపి హయాం లోనూ సాగింది. ఇప్పుడు వైఎస్‌ఆర్‌సిపి కాలంలోనూ కొనసాగుతోంది. ఈ రెండు పార్టీలూ ఈ విషయమై తమ విధానమేమిటో ప్రకటించాలి. ఈ విషయంలో మౌనంగా వుండడమంటే అక్కడ కొనసాగుతున్న వివక్షతను సమర్థించడమే.

పక్కనే ఉన్న కేరళ రాష్ట్రంలో ఓ ఆలయానికి ప్రధాన పూజారిగా దళితుణ్ణి నియమించి ప్రశంసలు అందుకుంటుండగా మన రాష్ట్రంలో ఆ వర్గాలను మభ్యపెట్టేందుకు ‘దళిత గోవిందం, గిరిజన గోవిందం, మత్స్య గోవిందం…’ అంటూ కులానికో ‘గోవిందం’, పేరు పెట్టి పాలకులు మోసానికి పాల్పడ్డారు.
వివిధ రూపాలలో కొనసాగుతున్న వివక్షలకు తిరుమల-తిరుపతి దేవస్థానం (టిటిడి) కేంద్రంగా వున్నది. పాలక పార్టీలు, ముఖ్యంగా బిజెపి లాంటి మతోన్మాద పార్టీ, పరివార్‌ శక్తుల ద్వంద్వ నీతిని, మోసాన్ని ఎదుర్కోవలసిన తరుణం ఆసన్నమైంది.

(వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు)

Courtesy Prajashakti

Add a comment...