కొన్ని విగ్రహాలు కేవలం చలనం లేని బొమ్మలు కాదు. కదం తొక్కిస్తాయి. మార్పు దిశగా జనాన్ని ఏకం చేస్తాయి. తరతరాలుగా వివక్షకు గురైన దళితుల కోసం అహర్నిశం కష్టపడిన భారత రాజ్యాంగ నిర్మాత  బీఆర్ అంబేడ్కర్ ఈ దేశంలో కోట్లమందికి ఒక నిరంతర స్ఫూర్తి. దళితుల ఆత్మగౌరవం కోసం కరడుగట్టిన ఆధిపత్య కొండలనే ఢీకొన్న ఆయనను స్మరించుకోడానికి ప్రభుత్వాలే కాదు, దళితవాడల జనం కూడా ప్రేమతో చందాలు వేసుకుని మరీ విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటుంటారు.

 

ఎందుకు?

కానీ అంబేడ్కర్ తెచ్చిన రిజర్వేషన్ల వల్ల తమకు అన్యాయం జరిగిందని కొందరు, ఇతరేతర కారణాలతో కొందరు ఆయన విగ్రహాలను అవమానిస్తుంటారు. ఈ రోజు పంజగుట్టలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని విధ్వంసం చేయడం వెనక అలాంటి కారణాలు లేకపోవచ్చు. కానీ ఒక మహనీయుడి విగ్రహం విషయంలో వ్యవహరించే సమయంలో అధికారుల నిర్లక్ష్యం అత్యంత గర్హనీయం. సాంకేతిక కారణాలతో జాతి గౌరవించే ఒక నేత విగ్రహాన్ని అనుచితంగా తొలగించడం ఏమాత్రం సమర్థనీయం కాదు. పైగా విగ్రహాన్ని తరలిస్తుండగా అదే పడిపోయి ముక్కలైందని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పడం దారుణం.

ఎవరు దోషులు?

అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు అనుమతి ఇవ్వాలని ఈ నెల 4నే అధికారులకు దరఖాస్తు చేసుకున్నామని అంబేడ్కర్ విగ్రహాల పరిరక్షణ కమిటీ చెబుతోంది. 10 రోజులైనా అనుమతి రాకపోవడంతో కమిటీ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అనుమతి విషయంలో జాప్యం కావడానికి జీఎహెచ్ఎసీ అధికారులే తీరే కారణమని తెలుస్తోంది. అయితే ఎన్నికలు ఉండడంతో ఇలాంటి దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించడం సాధ్యం కాదని కొందరు అధికారులు అంటున్నారు. జరిగిందేదో జరిగింది. కనీసం విగ్రహావిష్కరణ సమయంలోనైనా పోలీసులు, అధికారులు.. సంయమనం పాటించి ఉంటే సమస్య తలెత్తేది కాదు. నగరంలో ఏళ్ల తరబడి దర్జాగా ఉన్న అక్రమకట్టడాలు కోకొల్లలు. వాటి విషయంలో పద్ధతి పాటించినట్లే అంబేడ్కర్ విగ్రహంలో ఒక సహజన్యాయ ప్రక్రియను పాటించి ఉండాల్సింది. విగ్రహానికి అనుమతి లేదని చెప్పిన అధికారులు దాన్ని తాత్కాలికంగా అక్కడే ఉంచి, సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రయత్నించి ఉంటే విమర్శలు వచ్చేవి కావు. అలాకాకుండా ఏదో ప్రళయం వచ్చినట్లు,  హడావుడిగా అంబేడ్కరిస్టులను అరెస్ట్ చేసి, విగ్రహాన్ని లారీలో పడేసి, యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి తరలించడం, అక్కడి నుంచి ‘ఎవరో’ దాన్ని ఇతర ప్రాంతాలకు తీసికెళ్తుండగా వాహనం నుంచి ‘పడి’పోయి ముక్కలు కావడం, డంపింగ్ యార్డుకు చేరడం అధికారుల ‘పనితీరు’కు నిలువుటద్దం పడుతోంది.

ఎలా పరిష్కరించుకోవాలి?

అంబేడ్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి పక్కా ప్రణాళిక ఉంటే ఇలాంటి సంఘటనలు జరగవు. విగ్రహాన్ని పెట్టే స్థలం, ట్రాఫిక్ రద్దీ వంటి వాటిపై సరైన అవగాహనతో ముందుకెళ్లాలి. ప్రజల కోసం సర్వస్వం ధారపోసిన నేతలు ప్రజలకు ఇబ్బందిపడేలా తమ విగ్రహాలు ఉండాలని అనుకోరు. అందుకే, అనుమతులు పక్కాగా తీసుకోవాలి. ఆటంకాలు ఎదురైతే ప్రజాప్రతినిధుల ద్వారా పరిష్కరించేందుకు యత్నించాలి. కొందరి అత్యుత్సాహానికి తలొగ్గకుండా, తాము ఏర్పాటు చేసేది ఒక మహనీయుడి విగ్రహం అన్న ఎరుకతో ముందుకు సాగాలి. అంబేడ్కర్ విగ్రహమే కాదు, గాంధీ విగ్రహమైనా, పెరియార్ విగ్రహమైనా, మరొకరి విగ్రహమైనా అది మనం వారికి సమర్పంచే నివాళికి ఒక భౌతిక రూపం. దాన్ని పదికాలాలపాటు రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కనుక విమర్శలకు వీల్లేని మార్గంలోనే ముందుకు సాగాలి.

Add a comment...